Home Telangana భద్రాద్రి సీతారాముల కల్యాణం చూతము రారండి

భద్రాద్రి సీతారాముల కల్యాణం చూతము రారండి

0
2
Bhadrachalam Sitarama Kalyanam 2026
Spread the love

Bhadrachalam Sitarama Kalyanam 2026 | దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం పుణ్యక్షేత్రం రామయ్య పెళ్లి వేడుకకు ముస్తాబైంది. స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సర చైత్రశుద్ధ నవమి సందర్భంగా, మార్చి 27 (శుక్రవారం) ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో జగదభిరాముని కల్యాణం కన్నుల పండువగా జరగనుంది.

మిథిలా నగరంగా మారిన భద్రాద్రి

కల్యాణ మహోత్సవం కోసం భద్రాచలం పట్టణమంతా పెళ్లికళ సంతరించుకుంది. ఆకాశమంత పందిరి, భూదేవి అంత అరుగులు అన్నట్లుగా మిథిలా స్టేడియం ఆవరణలో చాందీనీ వస్త్రాలతో అద్భుతమైన అలంకరణలు చేశారు. గోదావరి నది తీరం నుండి బ్రిడ్జి సెంటర్ వరకు పట్టణమంతా చలువ పందిళ్లతో, విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఇప్పటికే వేలాదిగా భక్తులు భద్రాద్రికి చేరుకోవడంతో క్షేత్రం రామనామ స్మరణతో మారుమోగుతోంది.

రామదాసు చేయించిన ఆభరణాల అలంకరణ

ఈ కల్యాణ వేడుక (Bhadrachalam Sitarama Kalyanam) లో భక్త రామదాసు చేయించిన చారిత్రక ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి:

  • చింతాకు పతకం: సీతమ్మ తల్లికి అలంకరించే అత్యంత సుందరమైన పతకం.
  • పచ్చల పతకం: రామదాసు భరతుని పేరిట చేయించిన ఈ పతకాన్ని రామయ్య తండ్రికి ధరింపజేస్తారు.
  • మూడు పేటల మంగళసూత్రం: దశరథ మహారాజు, జనక మహారాజు మరియు భక్త రామదాసుల తరపున ప్రతినిధిగా మూడు మంగళ్యాలు ఉన్న సూత్రాన్ని అమ్మవారికి సమర్పిస్తారు.
  • రామ మాడ: రామలక్ష్మణులు తానీషాకు చెల్లించిన బంగారు నాణెం (రామమాడ) గొలుసును లక్ష్మణ స్వామికి అలంకరిస్తారు.

శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువు

అభిజిత్ లగ్నమందు జరిగే ఈ వేడుకలో పుణ్యాహవచనం, విష్వక్సేన పూజ, రక్షాబంధనం వంటి క్రతువులు నిర్వహిస్తారు. సీతమ్మ వారి నడుముకు దర్భతాడు బిగించడం, వధూవరుల గోత్రాలను పఠించడం (కన్యావరణం) వంటి ఘట్టాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ఈ ఏడాది కూడా ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను రాష్ట్ర ప్రతినిధులు సమర్పించనున్నారు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here